ముక్కుదిబ్బడతో బాధపడుతున్నారా?

మీరు ఒక మీటింగ్‌లో కూర్చుని ఉన్నారు. శ్వాస సాఫీగా లేదు. ముక్కులో ఏదో అడ్డుగా ఉన్న ఫీలింగ్. ముక్కుదిబ్బడ బాధిస్తుండగా శ్వాస తీసుకోడానికి బలంగా పీల్చారు. అందరి దృష్టీ మీ మీదే పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం శారీరకంగా ఇబ్బంది అయితే... అది తీసుకోవడానికి బలంగా పీలుస్తుండటంతో మరో సామాజిక ఇబ్బంది. మీరు తరచూ ముక్కుదిబ్బడతో ఇలా ఇబ్బందులు పడుతున్నారా? 

ముక్కుదిబ్బడతో శ్వాస పీల్చుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అలర్జీలు, సైనుసైటిస్, ముక్కులోని రెండు రంధ్రాల మధ్యన ఉండే దూలం (సెప్టమ్) సరిగా లేకపోవడం, దానిలో ఎంతో కొంత ఒంపు ఉండటం వంటి అనేక అంశాలు సక్రమంగా శ్వాస తీసుకోలేకపోవడానికి కారణమవుతాయి. వాస్తవానికి మనం ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకోవాలంటే అంతకు ముందుగా కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ముందుగా ముక్కులోకి ప్రవేశించిన గాలి ఉష్ణోగ్రతను... లోపల ఊపిరితిత్తుల వద్ద ఉన్న ఉష్ణోగ్రతతో దాదాపు సమం చేయడానికి ముక్కులోని మ్యూకస్ పొరలపై ఉండే నేసల్ టర్బినేట్స్ ప్రయత్నిస్తాయి.

అలాగే తేమను కూడా సమం చేయడానికి తోడ్పడతాయి. ముక్కులోపలి వెంట్రుకల సహాయంతో గాలిలోని కాలుష్యాలను తొలగించడానికి కొంత కసరత్తు జరుగుతుంది. కానీ అలర్జీల వంటి సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చి వాచే అవకాశం ఉంది. దాంతో ముక్కు ద్వారా సాఫీగా గాలి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. అలా ముక్కు దిబ్బడ వస్తుంది. దాంతో బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి వారు కాస్త విశ్రమిద్దామన్నా ప్రయోజనం ఉండదు. పడుకుంటే ఈ బాధ మరింత పెరుగుతుంది.


దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు...  

ఇలా తరచూ ముక్కుదిబ్బడ పట్టే వారికి దీర్ఘకాలంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇలాంటివారిలో గురక, స్లీప్ ఆప్నియా, తగినంత నిద్ర లేకపోవడంతో అసహనం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వైద్య చికిత్స ప్రక్రియలు:

ముక్కుదిబ్బడను అధిగమించడానికి కొన్ని రకాల సాధారణ చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా సులువుగా ఆచరించదగినవి. వీటితో చాలా వరకు మంచి ప్రయోజనం ఉంటుంది. డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్, నేసల్ స్ప్రేస్ రూపంలో సులభంగా లభించే ఈ మందులను డాక్టర్ సలహా మేరకే వాడటం మంచిది.

డీకంజెస్టెంట్స్: ముక్కులోని అడ్డంకి ఫీలింగ్‌ను తొలగించడానికి రూపొందించిన (ప్రధానంగా చుక్కలు, స్ప్రే రూపంలో ఉంటాయి) మందులు ఇవి. ముక్కు కారడం వంటి సమస్యలు పరిష్కారం దొరకకపోయినా శ్వాస సాఫీగా అయ్యేందుకు ఇవి చాలావరకు తోడ్పడతాయి.


యాంటీహిస్టమైన్స్: ఇవి ట్యాబ్లెట్స్, సిరప్ రూపంలో లభ్యమవుతాయి. ఇవి మ్యూకస్‌ను తొలగించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని దూరం చేస్తాయి. అయితే యాంటీహిస్టమైన్స్ చాలావరకు కాస్త చురుకుదనాన్ని తగ్గించి, మందకొడిగా చేస్తాయి.

సెలైన్ నేసల్ స్ప్రే: ముక్కులో వాడే స్ప్రే మందులు ముక్కుదిబ్బడను తగ్గిస్తాయి. 

ఆవిరి పట్టడం: ముక్కు దిబ్బడ పట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా ప్రయత్నించదగిన ప్రక్రియ ఆవిరి పట్టడం. విక్స్ లాంటి మందును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టే ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. అయితే వీటిన్నింటితో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సను సూచిస్తారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top