కూరగాయలే ఔషధాలా....నిజమండి..నమ్మండి

వెల్లుల్లి...

మీకు వెల్లుల్లి వాడే అలవాటు లేదా? దానికి స్వస్తి చెప్పి... వెల్లుల్లికి వెల్‌కమ్ చెప్పండి. ఎందుకంటే... వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ వెల్లుల్లి వాడేవారికి రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలను, పక్షవాతాన్ని సమర్థంగా నివారించినట్లు అవుతుంది. దాని ఘాటువాసనకు క్యాన్సర్ పరార్. ప్రత్యేకంగా చెప్పాలంటే అది నడయాడే చోటైన జీర్ణకోశం వంక క్యాన్సర్ కన్నెత్తి చూడటానిక్కూడా సాహసించదు. అంటే వెల్లుల్లి వాడేవారిలో గ్యాస్ట్రో ఇంటస్టినల్ క్యాన్సర్‌కు అవకాశాలు చాలా చాలా తక్కువ. 

మోతాదు: పై సుగుణాలు ఉన్నందున న్యూట్రిషనిస్టులు కనీసం రోజుకు 5 - 6 వెల్లుల్లి రెబ్బలను సిఫార్సు చేస్తుంటారు. 

క్యారట్...

ఎర్రటి క్యారట్ రంగు చూడాలంటే కళ్లు కావాలి. ఆ కళ్లకు ఆరోగ్యం కల్పించాలంటే మళ్లీ క్యారట్ కావాలి. చూశారా... క్యారట్‌కూ కళ్లకూ ఎంత దగ్గరి సంబంధమో! కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త. 

మోతాదు: రోజూ ఒక చిన్న కప్పు క్యారట్స్ తింటే మనలోని కొలెస్ట్రాల్ 11% తగ్గుతుంది. 

పాలకూర...

పాలకూరలో పాలు చూపించమంటే సాధ్యం కాదు. కానీ దానిలోని స్నేహంపాళ్లు చూపించడం సాధ్యమే. ఎందుకంటే... ఏ కూరతో కలిపి వండినా అందులోని పోషకాలను మన శరీరం గ్రహించేందుకు అనువుగా చేయడంలో పాలు పంచుకుంటుంది పాలకూర. అందుకే... పాలకూరను అందరూ తినాలి. అందరికీ పెట్టాలి. ఇక గర్భవతికి అయితే రోజూ తినిపించడం మంచిది. ఎందుకంటే... దానిలో విటమిన్-సి, బి6, రైబోఫ్లేవిన్, ఐరన్, క్యాల్షియమ్... ఇవన్నీ ఉంటాయి. గర్భవతికి రాసే పోషకాహార సప్లిమెంట్ మాత్రల్లో ఉండాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నింటి బదులు స్వాభావికంగా పాలకూర వాడటమే మంచిది కదా! 

లెట్యూస్...

బరువు తగ్గాలనుకుని మీరు మందులూ-మాకులూ వాడుతున్నారా? అవి మానేయండి. ఆకులు చాలు. అవే.. లెట్యూస్. శరీరానికి శ్రమ కలిగించని తేలికపాటి వ్యాయామం... దానితో పాటు లెట్యూస్ చాలు, తగ్గుతుంది ఒళ్లు. ఎందుకంటే ఇది లో క్యాలరీ డైట్. క్యాలరీలకే కొరత గానీ... విటమిన్-సి, ఫోలేట్, క్యాల్షియమ్, పొటాషియమ్ వీటికి కొదవ లేదు. రోజూ సాఫీగా విరేచనం కావాలంటే వేరే మందులు అక్కర్లేదు. రోజూ రాత్రిపూట తినే ఆహారంతో లెట్యూస్ తీసుకుంటే రాత్రికి తృప్తి. ఉదయాన సుఖ విరేచన సంతృప్తి. 

నిమ్మకాయ...

అమ్మ, నిమ్మ ఒక్కటే. చిన్నప్పుడు అమ్మ ముక్కు తుడుస్తుంది. అమ్మ చిన్నప్పుడు మాత్రమేనేమోగానీ... నిమ్మ మాత్రం ఎప్పుడూ జలుబును కా(ర)నివ్వదు. అందులోని విటమిన్-సి కారణంగా సంక్రమించే వ్యాధినిరోధకతతో జలుబును మాత్రమే కాదు, ఏ ఇన్ఫెక్షన్‌నూ తాకనివ్వదు. డాక్టర్లు మిమ్మల్ని ఉప్పు లేకుండా కూరల్ని తినమన్నారా? ఉప్పు లేని చప్పిడిదనాన్ని తప్పించి రుచి తెచ్చి మెప్పించేది నిమ్మ. ఇందులోని లిమోలిన్ అనే పోషకం క్యాన్సర్‌కు బద్ధశత్రువు. అందుకే అది క్యాన్సర్ సమరవీర... పోరాటశూర... నిమ్మధార. అందుకే అది నిమ్మ కాదు - నివురుగప్పిన నిప్పులాంటి నిమ్మ. 

ఉల్లి...

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది ఔషధాలు కనిపెట్టకముందునుంచీ వాడుకలో ఉన్న సామెత. ఉల్లి ముందా! మందు ముందా! అంటే... ఉల్లే ముందు. అనేక ఔషధులకు మాతృక ఉల్లి. ఉల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టే రక్తాన్ని పలచబారుస్తుంది. బ్లడ్‌క్లాట్స్‌ను వడపోసి బయటకు పంపిస్తుంది. రియల్ యాంటీబ్యాక్టీరియల్ ఎఫెక్ట్‌తో సూపర్‌ఫీషియల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది. తనలోని ఘాటెత్తే గంధకంతో క్యాన్సర్ పాలిటి మందుగుండు ఉల్లి. 

మిరియాలు...

గొంతు పెగలాలంటే మిరియంతో ఎల్లకాలాలూ నోరు కాలాలి. అందుకే హరికథకులు పాలతో పాటు మిరియాలు తీసుకుంటారు. గొంతుకే కాదు... కళ్లకూ మిరియాలు మంచివే. ఎందుకంటే ట్యూటిన్, జియాగ్జాంథిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉండి వాటితో కళ్లకు సంబంధించిన సమస్యలైన మాక్యులార్ డీజనరేషన్‌తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారిస్తుంటాయి. ఇలా అంధత్వ సమస్యలపై ఎప్పుడూ కారాలు నూరుతుంటాయి మిరియాలు. పైగా అందులోని ఫినోలిక్ యాసిడ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసోయమైన్స్‌ను కరిగించివేస్తాయి. ఇలా చూస్తే క్యాన్సర్‌కు కవచం... మన మిరియం. 

ఆలుగడ్డ (బంగాళదుంప)...

ఆలుబిడ్డలందరూ కలిసి చవగ్గా తినడానికి తేదగ్గవి ఆలుగడ్డలు. ఇవి తింటే లావెక్కుతారనేది పాక్షిక సత్యం మాత్రమే. ఇందులో విటమిన్-సి, బి6, పొటాషియం, మినరల్స్ ఉంటాయి. లావొక్కింతయు లేదు అంటూ నీరసంగా ఉండేవారిని హుషారుచేస్తాయి. అందుకే మోతాదుకు మించకుండా తినాలి. మరీ తప్పకపోతే తప్ప తొక్క తియ్యకుండా వండి తింటేనే మంచిది. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. వేపుళ్ల రూపంలో తింటేనే ఆరోగ్యాన్ని వేపుకు తింటాయి తప్ప... ఉడికించి తింటే ఉత్తమమే. ఇందుకు తార్కాణం ఒక్కటే... ఒక కప్పు అంత పెద్ద సైజు ఆలుగడ్డను ఉడికిస్తే అందులో 120-150 క్యాలరీలు ఉంటాయి. అదే వేపడం గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్‌లా నూనెలో ఫ్రై చేయడం గానీ చేస్తే అందులో 355 క్యాలరీలు ఉంటాయి. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top