ప్రస్తుతం జీవనశైలి మారిపోయింది. చాలా మందికి కనీసం తినటానికి కూడా సమయంఉండటం లేదు. కంగారుగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకోవటమే కానీ నెమ్మదిగా నమిలి తినటం మీద శ్రద్ద ఉండటం లేదు. ఆహారాన్ని నమిలి తినటం అనేది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
హడావిడిగా తినటం వలన ఎంత తింటున్నామో తెలియదు. మరో వైపు గాలి కూడా లోపలికి వెళ్ళి పోతుంది. తిన్నా కొంత సేపటికే ఆకలి వేస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.
అప్పుడు ఆకలి కూడా త్వరగా వేయదు. అంతేకాకుండా లాలాజల గ్రందులు చురుకుగా ఉంటాయి.
బాగా నమిలి తినటం వలన ఆహారం బాగా మెత్తగా అయ్యి లోపలికి వెళ్ళుతుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థకు పని తగ్గుతుంది.
అంతేకాక త్వరగా జీర్ణం అవుతుంది. నములుతున్నపుడు నాలుకకు రుచి తెలియటం వలన, ఆ ప్రభావం మెదడు మీద పడి,శరీరంలో మేలు చేసే హార్మోన్స్ విడుదలకు సహాయపడుతుంది.
ఆహారంలో ఉండే బ్యాక్టీరియ వలన కడుపులో గ్యాస్, ఇన్ ఫెక్షన్ వంటివి భాదిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ బ్యాక్టీరియ నాశనం కావాలంటే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.