Ragi Upma For Breakfast:ఈ మధ్య కాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి రాగులు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. రాగులను వారంలో రెండు సార్లు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
రాగులతో దోస, ఇడ్లీ, ఉప్మా,చపాతీ వంటివి తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రాగి ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. రాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్లో దొరికే రాగి పిండిని తెచ్చుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
రాగి పిండి ఒక కప్పు, జీలకర్ర అర స్పూను, ఆవాలు అర స్పూను, నూనె రెండు స్పూన్లు, పసుపు చిటికెడు, పచ్చిశనగపప్పు అర స్పూను, మినప్పప్పు అర స్పూను, ఉల్లిపాయ ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), పచ్చిమిర్చి రెండు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), టమాట ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), కరివేపాకు రెండు రెబ్బలు, కొత్తిమీర సరిపడా, ఉప్పు సరిపడా, నీరు రెండు కప్పులు.. నిమ్మరసం ఒక స్పూను
తయారీ విధానం
పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక స్పూను నూనె వేసి ఒక కప్పు రాగి పిండి వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. వేగిన రాగి పిండిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మూకుడులో ఒక స్పూను నూనె పోసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగించాలి. ఉల్లిపాయ కాస్త వేగాక టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు జల్లి టమాట ముక్క మెత్త పడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత అందులో నీటిని పోసి మరిగించాలి.
ఆ తర్వాత రాగి పిండి వేస్తూ బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇక దీనిలో నిమ్మరసం, కొత్తిమీర జల్లి దింపితే రాగి ఉప్మా రెడీ.
చాలామంది రాగి పిండితో జావా తయారు చేసుకునే తాగుతూ ఉంటారు. ప్రతిరోజు రాగిజావ తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా రాగి ఉప్మా చేసుకుంటే సరిపోతుంది. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా రాగి ఉప్మా తింటే చాలా మంచిది.
శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారికి మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఎముకలను బలంగా చేయడమే కాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. వారంలో రెండు సార్లు రాగి ఉప్మా చేసుకొని తింటే మంచిది.


