Raw Jackfruit Biryani Recipe:ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పనసకాయ బిర్యాని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ బిర్యాని తమిళనాడులో పెళ్లిళ్ల స్పెషల్.. ఆ తర్వాత ఆంధ్ర పెళ్లిళ్లలో కూడా వచ్చి చేరింది. పనసకాయను ఫ్రెష్ గా వాడవచ్చు... లేదంటే ఫ్రొజెన్ పనసకాయ ముక్కలను వాడవచ్చు.
కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం
ఒక్క స్పూన్ మిరియాలు
ఆరు లవంగాలు
ఆరు యాలకులు
రెండు అనాస పువ్వులు
ఒక అంగుళం దాల్చిన చెక్క
ఒక జాపత్రి
ఒక స్పూన్ జీలకర్ర
ఒక స్పూన్ సోంపు
ఒక బిర్యాని ఆకు
ఒక అంగుళం అల్లం ముక్క
ఏడు వెల్లుల్లి రెబ్బలు
బిర్యానీ కోసం
అరకప్పు నూనె బిర్యానీ కి
నాలుగు స్పూన్ల నూనె పనసకాయ ముక్కలను వేగించడానికి
300 గ్రాముల పనసకాయ ముక్కలు
ఒక కప్పు డబుల్ బీన్స్
మూడు యాలకులు
ఒక స్పూన్ జీలకర్ర
ఒక అంగుళం దాల్చిన చెక్క
ఒక అనాసపువ్వు
నాలుగు లవంగాలు
200 గ్రాముల ఉల్లిపాయ చీలికలు
నాలుగు పచ్చిమిర్చి చీలికలు
కొత్తిమీర తరుగు
పుదీనా తరుగు
పసుపు
ఒక స్పూన్ కారం
అర కప్పు పాలు
అరకప్పు చిలికిన పెరుగు
ఒక కప్పు టమోటా ముక్కలు
ఐదు కప్పుల వేడి నీళ్లు
మూడు కప్పుల బాస్మతి బియ్యం
అరకప్పు నెయ్యి
ఒక నిమ్మకాయ
తయారీ విధానం
మూకుడులో మిరియాలు, యాలకులు, లవంగాలు, అనాసపువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. వేగన ఈ మసాలా పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని పక్కన పెట్టాలి.
ఆ తర్వాత మూకుడులో నాలుగు స్పూన్ల నూనె వేసి పనసకాయ ముక్కలు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేసి యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, అనాసపువ్వు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేగించాలి.
ఉల్లిపాయలు మెత్తబడ్డాక డబుల్ బీన్స్ వేసి మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, కారం, పసుపు, మసాలా పేస్ట్, కొంచెం నీళ్లు పోసి మసాలాలోంచి నూనె పైకి తేలేదాకా వేయించాలి. ఆ తర్వాత పనసకాయ ముక్కలు, పెరుగు, పాలు, నిమ్మరసం వేసి నూనె పైకి తేలే వరకు మగ్గించాలి.
ఇప్పుడు బాస్మతి బియ్యం వేసి వేడి నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత బిర్యాని దాదాపుగా 80% ఉడుకుతుంది. ఆ తర్వాత నెయ్యి వేసి మూత పెట్టాలి . పొయ్యి మంట తగ్గించి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి అరగంట వరకు కదపకుండా వదిలేయాలి . ఈ స్పైసీ బిర్యానీ చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.


