Miriyala Annam:నిమిషాల్లో తయారయ్యే అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీ మిరియాల అన్నం.. జలుబు లేదా జ్వరంతో బాధపడుతున్నప్పుడు మిరియాల అన్నం తింటే చాలా మంచిది. ఈ రెసిపీ చాలా సులభం మరియు రుచికరం.
 సాధారణంగా లంచ్ కోసం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తాం. అలాంటి వాటిలో మిరియాల అన్నం ఒక గొప్ప ఎంపిక. చిత్రాన్నం, ఫ్రైడ్ రైస్, పులిహోర వంటి వాటితో పోలిస్తే ఇది చాలామందికి తెలియకపోవచ్చు. 
అయితే, కొత్తగా ఏదైనా రుచికరమైన లంచ్ రెసిపీ ట్రై చేయాలనుకుంటే, ఈ మిరియాల అన్నం ఖచ్చితంగా ప్రయత్నించదగినది. లంచ్ బాక్స్‌కి తీసుకెళ్లవచ్చు, కానీ వేడివేడిగా తింటే (కంఫర్ట్ ఫుడ్) రుచి మరింత బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి రైస్ - 1 కప్పు
నీళ్లు - 1.5 కప్పులు
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 20
పచ్చిమిర్చి - 5
కరివేపాకు - కొంచెం
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
ముందుగా బాస్మతి రైస్‌ను శుభ్రంగా కడగాలి. ఈ రెసిపీకి బాస్మతి రైస్ బాగా సరిపోతుంది. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్లు పోసి, అన్నం ఉడికించాలి. అన్నం కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి, ఒక ప్లేట్‌లో వేసి చల్లారనివ్వాలి.
అన్నం ఉడుకుతున్న సమయంలో, మిరియాలు మరియు జీలకర్రను మెత్తగా పొడి చేయాలి. మీకు మిరియాల ఘాటు ఇష్టమైతే, పొడిని కాస్త గరుకుగా దంచుకోవచ్చు.ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక పాన్‌లో నెయ్యి వేసి కాగనివ్వాలి. అందులో జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. జీడిపప్పు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, కరివేపాకు కూడా వేసి కలపాలి.
తయారు చేసిన మిరియాల-జీలకర్ర పొడిని పాన్‌లో వేసి కలపాలి. పొడి కాస్త వేగిన తర్వాత, ఉడికించి చల్లార్చిన బాస్మతి రైస్‌ను జోడించి బాగా కలపాలి.రుచికి సరిపడా ఉప్పు వేసి, 10 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ మగ్గనివ్వాలి.
చివరగా, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మిరియాల అన్నం సిద్ధం! దీనిని రైతాతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఘాటు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా నిమ్మరసం కూడా జోడించవచ్చు.


 
 
