Palak Methi pakodi:వానాకాలం స్పెషల్..కరకరలాడుతూ ఘుమఘుమలాడే పాలక్ మేథీ పకోడీ.. చల్లని వాతావరణంలో లేదా ఖాళీ సమయాల్లో వేడివేడి స్నాక్స్ తినాలని మనసు పదిలంగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో అందరూ మిర్చి బజ్జీ, పునుగులు, గారెలు వంటివి తయారు చేస్తూ ఉంటారు. వీటిలో పకోడీ కూడా ఒక ప్రత్యేకమైన స్నాక్. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ పకోడీలు అందరికీ ఇష్టమైనవి.
రెండు మూడు తిని, ఒక కప్ టీ తాగితే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. సాధారణంగా పకోడీలు శనగపిండి, ఉల్లిపాయలతో చేస్తారు. కానీ ఒకసారి ఆకుకూరలతో ట్రై చేశారా? లేదంటే ఇలా చేసి చూడండి – రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా కేవలం నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. ఇలా చేస్తే ఇంట్లో అందరికీ ఫేవరెట్ స్నాక్‌గా మారిపోతుంది. మరి టేస్టీ, వేడివేడి పాలక్ మేథీ పకోడీలు ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
మిరియాలు - అర టేబుల్ స్పూన్వాము - 1 టీ స్పూన్
ధనియాలు - 1 టీ స్పూన్
శనగపిండి - 1 కప్పు
కొత్తిమీర - 1 కప్పు
మెంతికూర - 1 కప్పు
పాలకూర - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
వంటసోడా - ¼ టీ స్పూన్
నిమ్మరసం - కొద్దిగా
పంచదార - ½ టీ స్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక చిన్న గిన్నెలో అర టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ ధనియాలు వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి.మరో పెద్ద గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకొని, కొద్దిగా ఉప్పు, తగినంత నీరు పోసి బాగా కలపండి. మూత పెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచండి.
తర్వాత శనగపిండి మిశ్రమంలో సన్నగా తరిగిన 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు మెంతికూర, 1 కప్పు పాలకూర, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపండి. మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టండి.
30 నిమిషాల తర్వాత మిశ్రమంలో ¼ టీ స్పూన్ వంటసోడా, కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. నెమ్మదిగా కలుపుతూ ½ టీ స్పూన్ పంచదార, దంచిన మిరియాలు-వాము-ధనియాల పొడి వేసి బాగా కలపండి.
స్టవ్ ఆన్ చేసి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె బాగా వేడైన తర్వాత చేతులు తడిచేసుకొని, చిన్నచిన్న ఉండలుగా పకోడీలు వేయండి.పకోడీలు బంగారు రంగు వచ్చే వరకు వేయించండి – ఎక్కువసేపు వేగితే మరింత క్రిస్పీగా ఉంటాయి.
వేగిన పకోడీలను టిష్యూ పేపర్‌పైకి తీసి, వేడివేడిగా సర్వ్ చేయండి. పుదీనా చట్నీ, టమోటా చట్నీ లేదా టమోటా సాస్‌తో తింటే రుచి అద్దిరిపోతుంది! వేడివేడి, క్రిస్పీ పాలక్ మేథీ పకోడీలు రెడీ!


