Ulava Pachadi:కొలెస్ట్రాల్ కరిగించే ఉలవల పచ్చడిని ఇంట్లో ఇలా చేసుకోండి.. కడుపు నిండా తినేస్తారు.. ఉలవలతో రకరకాల వంటకాలు చేయవచ్చు. వీటితో తయారుచేసే చారు అందరికీ ప్రియమైనది. వేడి అన్నంలో కొద్దిగా ఉలవ చారు పోసుకుని తింటే ఎవరైనా మురిసిపోతారు! అలాగే ఉలవలతో పచ్చడి కూడా సులభంగా తయారుచేయవచ్చు.
ఇది వేడి అన్నంతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. పైగా దీని తయారీకి ఎక్కువ కష్టం లేదు. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే త్వరగా, సులభంగా చేసుకోవచ్చు. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించేంత రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి! మరి నోరూరించే ఉలవ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారుచేయాలి? అనే వివరాలు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
ఉలవలు - 1 కప్పు
వెల్లుల్లి - 8 రెబ్బలు
చింతపండు - కొద్దిగా
కారం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర - అర టీ స్పూన్
ఆవాలు - పావు టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో చింతపండును తగినంత నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టండి.మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, ఒక కప్పు ఉలవలు వేసి కలియబెట్టండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి.
ఉలవలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్‌లో వేసి బరకగా పొడి చేసుకోండి.గ్రైండ్ చేసిన ఉలవ పొడిలో కొద్దికొద్దిగా నీళ్లు, నానబెట్టిన చింతపండు రసం జోడించండి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు వేసి మరోసారి మిక్సీలో గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
తాలింపు కోసం పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడెక్కించండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించండి. తాలింపు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి.ఈ తాలింపును ఉలవ పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలపండి.
అంతే! వేడివేడి ఉలవ పచ్చడి సిద్ధం.. సర్వింగ్ టిప్స్: వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, ఈ పచ్చడితో తింటే అదిరిపోతుంది. ఇడ్లీ, దోస, ఉప్మా వంటి టిఫిన్‌లకు కూడా బెస్ట్ కాంబినేషన్!
ఇంట్లో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే ఇంటివాళ్లు ఆనందంగా తింటారు. మీకు నచ్చితే వెంటనే ప్రయత్నించండి!


