Mughlai Egg Curry :నోరూరించే మొఘలాయి ఎగ్ కర్రీ – ఇలా చేస్తే కమ్మగా, వదలకుండా తినేస్తారు..సింపుల్‌గా, త్వరగా చేసుకునే రెసిపీల్లో ఎగ్ కర్రీ ఒకటి. కానీ ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొట్టేస్తుంది కదా!
అందుకే ఈరోజు కొత్త వేరియేషన్ తెచ్చాం – మొఘలాయి ఎగ్ కర్రీ. ఇది అన్నం, పులావ్, రొట్టె – ఏదైనా సూపర్ జోడీ. నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు. ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే, అందరూ ఫిదా అవుతారు. మరి, ఘుమఘుమలాడే ఈ మొఘలాయి స్టైల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం!
కావాల్సిన పదార్థాలు:
- కోడిగుడ్లు – 6
- వెన్న – ¼ కప్పు
- ఉల్లిపాయలు – 2 (మీడియం)
- జీడిపప్పు – 15
- టమాటాలు – 2 (మీడియం)
- పాలు – ½ కప్పు
- నూనె – ¼ కప్పు
- గరం మసాలా – 1 టీస్పూన్
- తాజా క్రీమ్ – ¼ కప్పు
- పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్‌స్పూన్
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్‌స్పూన్
- పసుపు – 1 టీస్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
- కారం పొడి – 1½ టీస్పూన్
- ధనియాల పొడి – 1 టేబుల్‌స్పూన్
- కస్తూరి మెంతి – 1 టీస్పూన్
తయారు విధానం:
స్టవ్ ఆన్ చేసి, ఒక గిన్నెలో 6 గుడ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించండి. ఉడికాక చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టండి.ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసుకోండి.
పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి, కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, 15 జీడిపప్పులు వేసి బాగా వేయించండి. టమాటాలు మెత్తబడినప్పుడు ¼ టీస్పూన్ ఉప్పు కలిపి స్టవ్ ఆఫ్ చేసి
చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీలో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి.
కడాయి పెట్టి మిగిలిన నూనె, ¼ కప్పు వెన్న వేసి కరిగించండి. వేడయ్యాక 1 టేబుల్‌స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్‌స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి 1 నిమిషం ఫ్రై చేయండి.1 టీస్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు, 1½ టీస్పూన్ కారం, 1 టేబుల్‌స్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి.
గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి మళ్లీ కలిపి, నూనె వేరయ్యే వరకు వేయించండి.½ కప్పు నీళ్లు, ½ కప్పు పాలు, ¼ కప్పు తాజా క్రీమ్ పోసి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి, మిశ్రమం కాస్త దగ్గరై నూనె వేరయ్యే వరకు ఉడికించండి.
ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కట్ చేసి వేసి కలపండి.చివరగా 1 టీస్పూన్ కస్తూరి మెంతిని చేత్తో నలిపి చల్లి, 1 నిమిషం మగ్గించండి. వేడివేడి మొఘలాయి ఎగ్ కర్రీ రెడీ!


