Ragi Mudda:మన పూర్వీకులలాంటి బలం కోసం పాతకాలం నాటి రెసిపి పిల్లలు ఇష్టంగా తినేలా "రాగి ముద్ద"... కర్ణాటకలో ప్రసిద్ధమైన రాగి ముద్దను ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మన ఇంట్లో కూడా రాగి ముద్ద చేస్తుంటాం కానీ, ఈ కర్ణాటక స్టైల్‌లో ఒకసారి ట్రై చేస్తే... అదిరిపోతుంది!
చాలా మృదువుగా, సాఫ్ట్‌గా వస్తుంది. కాస్త నెయ్యి దట్టించి, ఈ స్పెషల్ చట్నీతో కలిపి తింటే సూపర్ టేస్టీ! ఈ చట్నీ ప్రత్యేకంగా రాగి ముద్దెకు తగిలించి చేసేది – ఒక్కసారి ట్రై చేసి చూడండి, మరచిపోలేరు!
రాగి ముద్దకు కావలసిన పదార్థాలు (1-2 మందికి):
రాగి పిండి - 1 కప్పు
ఉప్పు - ¼ స్పూన్
నీళ్లు - అవసరమైనంత
స్పెషల్ చట్నీకి కావలసిన పదార్థాలు:
పల్లీలు - ¼ కప్పు
పచ్చిమిర్చి - 4
పుట్నాలపప్పు (రోస్టెడ్ గ్రామ్) - ¼ కప్పు
తాజా కొబ్బరి ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6 + 3 (విడిగా)
చింతపండు - కొద్దిగా (నిమ్మకాయ సైజు)
జీలకర్ర - ½ స్పూన్ + ½ స్పూన్ (విడిగా)
ఉప్పు - తగినంత
కరివేపాకు - 1 రెమ్మ
పోపు (తాళింపు) కోసం:
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిర్చి - 2
ఆవాలు - ½ స్పూన్
మీడియం సైజు ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
కొత్తిమీర - కొద్దిగా (తరుగు)
ALSO READ:ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే మ్యాజిక్ డ్రింక్రాగి ముద్ద తయారీ విధానం:
1 కప్పు రాగి పిండిలో నుండి 2 టేబుల్ స్పూన్ల పిండిని తీసి, ½ కప్పు నీళ్లలో ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి.ఒక కడాయిలో 1½ కప్పు నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు వేడెక్కాక ఉప్పు, కలిపిన రాగి మిశ్రమం వేసి బాగా గరిటెతో కలుపుతూ మరిగించండి.
మిగతా రాగి పిండిని నీళ్ల పైన సన్నగా చల్లి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 నిమిషాలు ఆవిరి పట్టనివ్వండి.మూత తీసి, సన్నని మంట మీద చెక్క గరిటెతో నిరంతరం కలుపుతూ ఉడికించండి. ఎంత బాగా కలిపితే అంత మృదువుగా వస్తుంది!
జిగురు తగ్గి, చేతికి అంటకుండా వచ్చే వరకు (సుమారు 10 నిమిషాలు) కలుపుతూ ఉడికించండి. మంట ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి.
10 నిమిషాల తర్వాత చేతులు తడి చేసుకుని గుండ్రటి ముద్దెలుగా ఆకారం ఇవ్వండి. (చేతులు కాల్తున్నాయేమో అని అనిపిస్తే, ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో ముద్దెను వేసి తిప్పండి – సులభంగా గుండ్రంగా వస్తుంది!)..నెయ్యి వేసుకుని, ఈ స్పెషల్ చట్నీతో కలిపి తింటే అద్భుతం!
స్పెషల్ చట్నీ తయారీ విధానం:
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, పల్లీలు వేయించి పక్కన తీసి పెట్టండి.అదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేగాక తరిగిన ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి వేగించి పక్కన పెట్టండి (ఇది పోపు).
మిక్సీ జార్‌లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాలపప్పు, కొబ్బరి ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ½ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి.గ్రైండ్ చేసిన చట్నీలో వేయించిన పోపు కలిపి సర్వ్ చేయండి.
ఈ కాంబినేషన్ హెల్తీ, టేస్టీ అండ్ ట్రెడిషనల్! ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి


