గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం: చేదు లేకుండా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేలా అద్దిరిపోయే రెసిపీ!

Kakarakaya masala
"కాకరకాయా? అబ్బే చేదుగా ఉంటుంది.. నాకు వద్దు!" అనే వాళ్లు మీ ఇంట్లో ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ పద్ధతిలో గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం (Guntur Kakarakaya Karam) చేసి పెట్టండి. 

కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికి, చేదు ఏమాత్రం తెలియకుండా, మంచి కమ్మని రుచితో ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వారు కూడా మళ్లీ మళ్లీ చేయమని అడిగి మరీ తింటారు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు:
కాకరకాయలు – 300 గ్రాములు (చిన్న సైజువి అయితే బాగుంటాయి)
సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు (బిర్యానీకి తరిగినట్లు పొడవుగా)
వెల్లుల్లి రెబ్బలు – 15
కరివేపాకు – 2 రెబ్బలు
పోపు దినుసులు – అర టీస్పూన్
నూనె – సరిపడా
పసుపు, ఉప్పు – సరిపడా

స్పెషల్ కారం పొడి (స్టఫింగ్) కోసం:
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) – 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
పుట్నాల పప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
గుంటూరు ఎండుమిర్చి – 7 నుండి 8
చింతపండు – 2 చిన్న రెబ్బలు
కారం – 1½ టీస్పూన్ (రచికను బట్టి)
చేదు పోగొట్టే సీక్రెట్ :
కాకరకాయలను కడిగి, పైన ఉండే గరుకు భాగాన్ని లైట్‌గా చెక్కాలి.

ఒకవైపు నిలువుగా గాటు పెట్టి లోపలి గింజలను తీసేయాలి (ఈ తెల్లటి గింజలను పారేయకుండా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి).

కాకరకాయల లోపల, బయట అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు బాగా రుద్ది 20-30 నిమిషాలు పక్కన పెట్టాలి.

ఆ తర్వాత కాకరకాయలను గట్టిగా పిండి ఊరిన చేదు నీటిని పూర్తిగా తీసేయాలి.

తయారీ విధానం:
1. మసాలా కారం పొడి తయారీ:
కడాయిలో పల్లీలను దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే పుట్నాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం వేయించి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో వేయించిన దినుసులు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా (కోర్స్‌గా) గ్రైండ్ చేసుకోవాలి.

2. కాకరకాయలను వేయించడం & స్టఫింగ్:
కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి, పిండిన కాకరకాయలను మీడియం మంటపై ఎర్రగా, మెత్తబడే వరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

వేగిన కాకరకాయలు చల్లారాక, మనం తయారుచేసిన కారం పొడిని కాకరకాయల లోపల నిండుగా స్టఫ్ చేసుకోవాలి.

3. కాకరకాయ కారం ఫినిషింగ్:
అదే కడాయిలో (అవసరమైతే మరో 2 స్పూన్ల నూనె వేసి) పోపు దినుసులు వేసి వేయించాలి.

ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

ఇందులోనే దంచిన వెల్లుల్లి, కరివేపాకు మరియు మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ గింజలు వేసి మరో 2-3 నిమిషాలు ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు స్టఫ్ చేసిన కాకరకాయలను వేసి 2 నిమిషాలు వేయించాలి.

చివరగా మిగిలిన కారం పొడిని కూడా మొత్తం వేసి మీడియం మంటపై 2-3 నిమిషాలు బాగా కలిపి ఫ్రై చేసి దించేయాలి.

ఇలా చేసిన కాకరకాయ కారం గది ఉష్ణోగ్రత వద్ద 3 నుండి 5 రోజులు, ఫ్రిజ్‌లో పెట్టుకుంటే 10 రోజుల వరకు తాజాగా, కమ్మగా నిల్వ ఉంటుంది.

మీరూ తప్పకుండా ఈ గుంటూరు స్టైల్ కాకరకాయ కారం ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు రుచి చూపించండి!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top